Job 38

1అప్పుడు యెహోవాా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.

2జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు?
3పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి.

4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

5నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు?

6
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Job 38:7.
In this translation, this verse contains text which in some other translations appears in verses Job 38:6-Job 38:7.
7దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు?


8సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు?

9నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా?

10సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు,

11<<నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి>>అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?

12నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా?

13దుష్టులు దానిలో ఉండకుండా దులిపి వేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా?

14ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి.

15దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది.

16సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా?

17మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా?
18భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు.

19వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది?

20వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా?
21ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.

22
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Job 38:23.
In this translation, this verse contains text which in some other translations appears in verses Job 38:22-Job 38:23.
23నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా?

ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.
24మెరుపులను వాటి వాటి దారుల్లోకి పంపించే చోటు ఏది? తూర్పు గాలి ఎక్కడనుండి బయలుదేరి భూమి మీద నఖముఖాల వీస్తుంది?

25మనుషులు లేని తావుల్లో వర్షం కురిపించడానికి, నిర్జన ప్రదేశాల్లో వాన కురియడానికి,

26చవిటి నేలలను, జన సంచారం లేని ఎడారులను తృప్తి పరచడానికి, అక్కడ లేత గడ్డి పరకలు మొలిపించడానికి,
27వర్ష ధారలకోసం కాలవలను, ఉరుములు గర్జించడానికి దారులను ఏర్పరచిన వాడెవడు?

28వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను కన్నది ఎవరు?

29మంచు గడ్డ ఎవరి గర్భంలోనుండి వస్తుంది? ఆకాశం నుండి జాలువారే మంచును ఎవరు పుట్టించారు?
30జలాలు దాక్కుని రాయిలాగా గడ్డకట్టుకుపోతాయి. అగాధజలాల ఉపరితలం ఘనీభవిస్తుంది.

31కృత్తిక నక్షత్రాలను నువ్వు బంధించగలవా? మృగశిరకు కట్లు విప్పగలవా?

32వాటి కాలాల్లో నక్షత్ర రాసులను వచ్చేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను వాటి ఉపనక్షత్రాలను నువ్వు నడిపించగలవా?
33ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా?

34జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా?

35మెరుపులు బయలుదేరి వెళ్లి <<చిత్తం ఇదుగో ఉన్నాం>> అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా?

36మేఘాల్లో జ్ఞానం ఉంచిన వాడెవడు? పొగమంచుకు తెలివి నిచ్చిన వాడెవడు?

37నైపుణ్యంగా మేఘాలను లెక్క బెట్ట గలవాడెవడు?
38మట్టి గడ్డల్లోకి ధూళి దూరి అవి ఒక దానికొకటి అంటుకొనేలా మేఘ కలశాల్లోనుండి నీటిని ఒలికించ గలిగింది ఎవరు?

39ఆడసింహం కోసం నువ్వు జంతువును వేటాడతావా?

40సింహం పిల్లలు తమ గుహల్లో పడుకుని ఉన్నప్పుడు, తమ మాటుల్లో పొంచి ఉన్నప్పుడు నువ్వు వాటి ఆకలి తీరుస్తావా?

కాకి పిల్లలు దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆకలికి అలమటించేటప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవాడెవడు?

41

Copyright information for TelULB